1 Corinthians 1

కృపలో విశ్వాసి స్థానం

1దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, సోదరుడు సొస్తెనేసు, 2కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికీ, మనకూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రతి చోటా ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది. 3మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక.

4క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 5క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది. 6అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు.

7కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. 8మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకూ ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. 9మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.

క్రీస్తులో కొరింతి విశ్వాసుల స్థానంతో పోల్చుకుంటే వారి పతనమైన ఆధ్యాత్మిక స్థితి

10సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్నివేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.

1. వారు మానవ నాయకులను అనుసరిస్తున్నారు

11సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది.

12మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.

13క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా?

14నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 15ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. 16స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు.

17క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.

2. మానవపరమైన జ్ఞానంలో అతిశయిస్తున్నారు

18సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. 19దీని గురించే ‘జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను’ అని రాసి ఉంది.

20జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? 21లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.

22యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. 23అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు.

24అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. 25ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.

3. ఏది ఏమైనా వారు అంత జ్ఞానులు కారు

26సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు, బలవంతుల్ని సిగ్గు పరచడానికి లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.

28గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.

30అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.

31

Copyright information for TelULB